విడుదల తేదీ : 29 నవంబర్ 2013
దర్శకుడు : మేర్లపాక గాంధీ
నిర్మాత : కిరణ్
సంగీతం : రమణ గోగుల
నటీనటులు : సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్…
ఇ24తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మాతగా మేర్లపాక గాంధీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన కామెడీ లవ్ ఎంటర్ టైనర్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించింది. చాలా రోజుల రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమాలో సప్తగిరి అదేనండి నెల్లూరు గిరి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ జర్నీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
రామ్మూర్తి(నాగినీడు) ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్. స్కూల్లో పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉండాలంటారో అదే రేంజ్ లో మన రామ్మూర్తి ఇంట్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. 100 తప్పులు చేసిన శిశుపాలున్ని శ్రీ కృష్ణుడు చంపేసినట్టు రామ్మూర్తి కూడా తన కుటుంబం కోసం ఓ కుటుంబ రాజ్యాంగం రాస్తాడు. దాని ప్రకారం ఇంట్లో ఎవరన్నా 100 తప్పులు చేస్తే వారిని ఇంట్లోనుంచి బయటకు పంపేస్తాడు. అలాంటి స్ట్రిక్ట్ రామ్మూర్తి చిన్న కొడుకే మన హీరో సందీప్(సందీప్ కిషన్). సందీప్ కి ఏమో తన కళ్ళముందు ఎక్కడ ఏ చిన్న గొడవ జరుగుతున్నా తల దూర్చడం అలవాటు. మరి అలాంటప్పుడు సందీప్ చేసే తప్పులు పెరిగిపోతాయి కదా.. అలా సందీప్ 99 తప్పులు పూర్తవుతాయి. ఇంకో తప్పు చేస్తే ఇంట్లో నుంచి తరిమేస్తానని రామ్మూర్తి వార్నింగ్ ఇస్తాడు.
అప్పుడే సందీప్ అన్న అయిన బ్రహ్మాజీ (బ్రహ్మాజీ) పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం అందరూ హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి బయలుదేరుతారు. ఆ జర్నీలో, పెళ్ళిలో సందీప్ తన 100వ తప్పు చేయకుండా ఉండటానికి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? చివరికి 100వ తప్పు చేసాడా? లేదా? అసలు ఈ జర్నీలో హీరోకి ప్రార్ధన(రాకుల్ ప్రీత్ సింగ్)కి ఎలా పరిచయమైంది? అసలు ప్రార్ధన ఎవరు? అసలు చివరికి బ్రహ్మాజీ పెళ్లి జరిగిందా? లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి…
ప్లస్ పాయింట్స్ :
సందీప్ కిషన్ నటన బాగుంది. సందీప్ కిషన్ సోలో హీరోగా చేసిన ఈ రెండవ సినిమా ద్వారా నటనపరంగా కాస్త మెరుగయ్యాడు. మొదటిసారి సందీప్ కిషన్ ఈ సినిమాలో డాన్సులు బాగా చేసాడు. రాకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బాగుంది. ‘మెలమెల్లగా’ పాటలో రాకుల్ ప్రీత్ సింగ్ ని చాలా గ్లామరస్ గా కనిపించింది. హీరోయిన్ ది చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా మంచి మార్కులే కొట్టేసింది.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ముఖ్యంగా తాగుబోతు రమేష్ చేసిన ఆణిముత్యం పాత్ర దాదాపు సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. అలాగే నెల్లూరు సప్తగిరి చేత చేయించిన దస్తగిరి ఫ్రం వెంకటగిరి ట్రాక్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ట్రైన్ లో అతనిచేత చేయించిన ఎపిసోడ్స్ అన్ని బాగా నవ్వు తెప్పిస్తాయి.
బ్రహ్మాజీ పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూసే పాత్రని బాగా చేసాడు. స్ట్రిక్ట్ ఫాదర్ రామ్మూర్తి పాత్రలో నాగినీడు నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ సినిమాలను ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడం కాస్త కష్టమైన విషయం కానీ డైరెక్టర్ చాలా తెలివిగా ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి బాగా డీల్ చేసాడు.
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునే స్థాయిలో లేవు. సెకండాఫ్ లో ఎం.ఎస్ నారాయణ చేసిన థ్రిల్ మాస్టర్ పాత్ర బాగోలేదు. జయప్రకాశ్ రెడ్డి పాత్ర కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు.
సినిమా ఫస్ట్ హాఫ్ సాగింతంత వేగంగా సెకండాఫ్ ఉండదు. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గడంతో పాటు కాస్త ఊహాజనితంగా తయారవుతుంది. సినిమాని అక్కడక్కడా సాగదీశారు. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ సినిమాల్లో క్లైమాక్స్ లా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. కానీ ఆ సినిమాల స్థాయిలో లేదు.
సాంకేతిక విభాగం :
సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జర్నీలో ఎక్కువ భాగం సాగే ఈ సినిమాలోని ప్రతి ఫ్రేం కలర్ఫుల్ గా ఉండేలా చోటా కె నాయుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. రమణ గోగుల అందించిన పాటలు బాగున్నాయి, అలాగే సినిమాకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ విషయంలో ఎడిటర్ ని ఏమీ అనడానికి లేదు కానీ సెకండాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.
ఈ సినిమాకి కీలకమైన కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అనే కీలకమైన విభాగాలను మేర్లపాక గాంధీ డీల్ చేసాడు. ఈ యంగ్ డైరెక్టర్ లో విషయం ఉంది అనేది మనకి ఫస్ట్ హాఫ్ చూడగానే అర్థమవుతుంది. కథ – చాలా సింపుల్ పాయింట్, స్క్రీన్ ప్లే – చాలా తెలివిగా రాసుకున్నాడు.. ఫస్ట్ హాఫ్ లో ఉపయోగించినంత తెలివిని సెకండాఫ్ లో కూడా ఉపయోగించి ఉంటే బాగుండేది. మాటలు – కామెడీ ట్రాక్స్ కి మాత్రం సూపర్బ్ గా రాసాడు. కానీ క్లైమాక్స్ సీన్స్ కి మాత్రం ఇంకాస్త ఎఫ్ఫెక్టివ్ గా ఉండాల్సింది. ఇక చివరిగా డైరెక్షన్ – నటీనటుల అందరి నుంచి మంచి నటనని రాబట్టుకున్నాడు. ఓవరాల్ గా డైరెక్టర్ గా గాంధీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే జెమిని కిరణ్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా, సెకండాఫ్ ఏమో జస్ట్ ఎక్స్ ప్రెస్ లా సాగుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. సినిమా కోసం ఎంచుకున్నది చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ డైరెక్టర్ దానిని చాలా బాగా డీల్ చేసాడు. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయితే సెకండాఫ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం, ఎమోషనల్ సీన్స్ సరిగా లేకపోవడం ఈ సినిమాలో చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఓ సారి చూడదగిన సినిమా.
No comments:
Post a Comment