అంతే… ఒక్క సినిమా చాలు. హీరోలను జీరోలు చేయడానికి. జీరోలను హీరోలుగా మార్చడానికి. ఈ వేసవిలో అదే జరిగింది. బాక్సాఫీసు ముందుకు ఎన్నో సినిమాలొచ్చాయి. భారీ అంచనాలు మోసుకొని వచ్చిన సినిమాలు తుస్సుమంటే…. ఈ సినిమాకి అంత సీను లేదు.. అనుకొన్న వన్నీ దుమ్మురేపేశాయి. వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్… వీళ్ల సినిమాలకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. చిన్న హీరోలు నిఖిల్, నితిన్, నాగచైతన్యలకు హిట్లు దక్కాయి. ఇప్పుడు వాళ్లంతా ఫామ్‌లోకి వచ్చేశారు.
చిత్రసీమకు సంబంధించి మూడు సీజన్లు చాలా కీలకం. సంక్రాంతి, దసరా.. ఆ తరవాత వేసవి. యువతరానికి సెలవులు దొరుకుతాయి. వాళ్లంతా మంచి సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఓ మాదిరి సినిమా పడినా… హిట్ చేస్తుంటారు. అందుకే ఆయా సీజన్లను క్యాష్ చేసుకోవాలనేది నిర్మాత ఆలోచన. ఈ వేసవి కూడా పెద్ద సినిమాలతో భారీగానే ముస్తాబయ్యింది. బాద్‌షా, గ్రీకువీరుడు, షాడో సినిమాలు సందడి చేశాయి. ఇవి మూడూ నిరాశాజనకమైన ఫలితాలు మూటగట్టుకొన్నాయి. బాద్‌షాకి ముందు హిట్ టాక్ వచ్చినా… అది నిలుపుకోలేక చతికిలపడింది. షాడోపై ఏకగ్రీవకంగా ఫ్లాప్ ముద్ర వేసేశారు. గ్రీకువీరుడు పాత కాలపు కథతో మరుగున పడింది. దాంతో పెద్ద సినిమాలు ఈ సీజన్‌ని ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయాయి.
పెద్ద సినిమా వస్తోందంటే చిన్నసినిమా ఆమడదూరం పారిపోతున్న రోజులివి. ఎందుకంటే థియేటర్ల కొరతతో.. చిన్నసినిమాకి చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా బాగున్నా సరే.. స్టార్‌ల సినిమాల్లో నలిగిపోతాయి. దాంతో చిన్న నిర్మాతలు కాస్త జంకుతున్నారు. అయితే స్వామి రారా, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు మంచి వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. నిఖిల్‌కి అంతకు ముందు హిట్ లేదు వరుసగా అయిదు ఫ్లాప్‌లను చవిచూశాడు. స్వామి రారా సినిమాతో మళ్లీ ఆయన ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక నితిన్ రెండో హిట్ కొట్టి తానేమిటో నిరూపించుకొన్నాడు. ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్లు సాధించి… నితిన్‌ని పెద్ద హీరోల జాబితాలో చేర్చింది. ఇక విజయాలు లేక సతమతమవుతున్న నాగచైతన్యకూ హిట్ దక్కింది. ఎట్టకేలకు తన తడాఖా చూపించే అవకాశం దక్కింది.
ఈ మూడు సినిమాలు తప్ప… ఈ వేసవిని ఎవరూ సొమ్ము చేసుకోలేకపోయారు. క్లీన్ హిట్ గా నిలిచింది.. గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ఒక్కటే. అంటే చేజేతులా చిత్ర పరిశ్రమ కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొందన్నమాట. ఈ సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు రెండే! వేసవి చూస్తే ఇలా నిరుత్సాహ పరిచింది.
ఇద్దరమ్మాయిలతో ఒక్కటే మిగిలింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా… ఈ లోటు పూడ్చలేదు. దాని తరవాత కనుచూపు మేరల్లో పెద్ద సినిమాల వచ్చే సూచనలు కనిపించడం లేదు. స్టార్ హీరో సినిమా రావాలంటే ఆగస్టు వరకూ ఎదురుచూడాల్సిందే. ఈలోపు చిన్న సినిమాలే దిక్కు. రాబోయే దసరాకయినా మన హీరోలు పుంజుకోవాలని, మంచి సినిమాలతో మురిపించాలని ఆశిద్దాం.