ఇ24తెలుగు.కామ్ 4/5 | Click here for English Review
సంపూర్ణమైన వినోదాలకు దారిదే…
పవన్ కల్యాణ్ కనిపించగానే చేతిలో గన్నో, కత్తో పెట్టేసి – అతనికో మేనరిజం ఆపాదించేసి – ఆ ఇమేజ్ చుట్టూ ఓ కథ అల్లేసి – నాలుగు ఫైట్లూ, ఆరు పాటలూ జోడించేసి సినిమా తీసేస్తే కనీసం మినిమం గ్యారెంటీ బొమ్మ అయిపోతుంది. ఎందుకంటే పవన్ రేంజు అలాంటిది. అతని కటౌట్ కి ఉన్న పవర్ అలాంటిది. అలాంటి పవన్ ని తీసుకొచ్చి… ఓ కుటుంబంలో పడేశాడు త్రివిక్రమ్!! అసలు ఎంత ధైర్యముండాలండీ.. పవన్ ని ఫ్యామిలీ డ్రామాలో ఇరికించడానికి? ఎంత తెగువ చూపించాలండీ… మాస్ ముద్ర ఎవరెస్ట్ అంత ఉన్న హీరోకి… అత్తారింటికి దారేది అనే టైటిల్ పెట్టడానికి?? ఇవి రెండూ త్రివిక్రమ్ చేశాడు. త్రివిక్రమ్ ని నమ్మి… పవన్ రంగంలోకి దిగిపోయాడు. ఫలితంగా వవన్ లో ఇప్పటి వరకూ ఎవరూ చూపించని, చూడని కోణం ఆవిష్కృతమైంది. అత్తారింటికి దారేదిలో. అసలింతకీ క్లాస్ ని, మాస్ నీ కంబైన్డ్ గా ఆకట్టుకొనే ప్రయాణంలో వీరిద్దరూ ఎంత వరకూ సక్సెస్ అయ్యారు?? అత్తారింట్లో ఏముంది?? తెలుసుకొందాం.. రండి.
ఇటలీలో రఘనందన్ (బొమన్ ఇరానీ) లక్ష కోట్లకు అధిపతి. అతని మనవడే… గౌతమ్ నంద (పవన్ కల్యాణ్). ఆనందం డబ్బులో లేదు.. మానవ సంబంధాల్లో ఉంది అని నమ్మే వ్యక్తి. రఘనందన్ కి అంత ఆస్తి ఉన్నా.. ఒక్కటే లోటు. కూతురు సునంద (నదియా) తనతో లేదు. `నీ ప్రతి పుట్టిన రోజుకీ నీకో బహుమానం ఇచ్చేవాడిని. ఈసారి నేనే నిన్ను అడుగుతున్నా.. మీ అత్తను తీసుకొస్తావా..`అని మనవడిని ఓ కోరిక కోరతాడు. దాన్ని తీర్చడానికి ఇండియా వస్తాడు.. గౌతమ్. సునంద ఓ ఫైవ్ స్టార్ హోటల్ యజమాని. కానీ ఏం లాభం అప్పుల్లో ఉంటుంది. భర్త (రావు రమేష్)ని ఓ యాక్సిడెంట్ నుంచి కాపాడి, అతనికి దగ్గరవుతాడు. సిద్దూ అనే పేరుతో ఆ ఇంట్లో డ్రైవర్ గా మారతాడు. సునందకు ఇద్దరు కూతుర్లు. ప్రమీల (ప్రణీత), శశి (సమంత). ఆ ఇంట్లో సాదారణమైన డ్రైవర్ గా చేరతాడు గౌతమ్. అత్త కష్టాలను తీర్చి.. ఆ ఇంటికి కొత్త శోభ తీసుకొస్తాడు. కానీ ఇంతలోనే మరో సమస్య వెతుక్కొంటూ వస్తుంది. అదేంటి? ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొన్నాడు. ఇంతకీ అత్త మనసు మార్చగలిగాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.
నిజం చెప్పాలంటే ఇదేం అద్భుతమైన కథ కాదు. కొత్త కథ అసలే కాదు. కానీ కొత్తగా చెప్పే వీలున్న కథ. ఆ అవకాశాన్ని త్రివిక్రమ్ అందిపుచ్చుకొన్నాడు. అసలు పవన్ ఇమేజ్ కుటుంబ కథకు మ్యాచ్ అవుతుంది… అని త్రివిక్రమ్ నమ్మడం, దాన్ని ఆచరణలో పెట్టడం ఇలాంటి కథ బయటకు రావడానికి మూలం. పవన్ సినిమా అనగానే ఏవేవో ఊహించుకొని వెళ్లే అభిమానులకు నిజంగా త్రివిక్రమ్ తీయని షాక్ ఇస్తాడు. ఎప్పుడూ కారం ఏం తింటారు…? ఈసారి స్వీట్ పుచ్చుకొండీ అంటూ మన రుచుల్ని మారుస్తాడు. దర్శకులు, హీరోలూ ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తారేంటి? ఆ బంధనాలు తెంచుకొని రాలేరా?? అనే ప్రశ్నకు ఈ సినిమా ఓ సమాధానం ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ చేయాల్సిన సినిమా కాదిది. కానీ… ఎప్పుడూ మాస్ మసాలా కథలు ఎంచుకొంటున్న పవన్ ని ఈసారి త్రివిక్రమ్ కాస్త విభిన్నంగా చూపించాడు. అందుకే ఈ క్రెడిట్ ఇద్దరికీ దక్కాలి.
త్రివిక్రమ్ సినిమా అంటే సీన్ కి ఓ పంచ్ అయినా పడాల్సిందే. ఆ అంచనాలను నెరవేర్చుకొంటూ సినిమాని ముందుకు నడిపించాడు త్రివిక్రమ్. సమంత కిడ్నాప్ వ్యవహారంతో కథ మొదలవుతుంది. ఆ తరవాత ఇటలీలో పవన్ హీరోయిజం చూపించి కథను ఇండియాకు మళ్లించాడు త్రివిక్రమ్. నదియా ఇంటి వ్యవహారాలూ, అక్కడ ఇద్దరు మరదళ్లతో పవన్ చేసిన హంగామా, కోటీశ్వరుడైనా సరే, ఓ డ్రైవర్ గా ఇమిడిపోవడానికి పడిన పాట్లూ వెరసి కథని వినోదాల బాట పట్టిస్తాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఎమోషన్ల ను బాగా క్యారీ చేశాడు. ఇంట్రవెల్ తరవాత.. కథాగమరంలో కాస్త త్రోటు పాటు వచ్చినా.. మళ్లీ తొందరగానే పట్టాలెక్కించేశాడు త్రివిక్రమ్. తన పంచ్ నీ, పవర్ స్టార్ పవర్ నీ బాగా వాడుకొంటూ పతాక సన్నివేశాలకు తీసుకొచ్చాడు. అక్కడ షరా మామూలే. ఓ ఫైట్ తో శుభం కార్డు వేశాడు. అక్కడక్కడా సెంటిమెంట్ల ను బాగా దట్టించి – ఓ కుటుంబ కథా చిత్రంగా మరల్చే ప్రయత్నం చేశాడు.
సాధారణంగా వన్ మ్యాన్ షో అంటుంటాం. ఇది త్రీ మ్యాన్ షో. పవన్, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురూ ఈ సినిమాకి మూల స్థంబాలుగా నిలిచారు. ఏమాత్రం హడావుడి లేని కథని పవన్ తన ఇమేజ్ తో, డైలాగ్ డెలివరీతో చాలా వరకూ లాక్కొచ్చాడు. ఈ సినిమాలో పవన్ చాలా అందంగా కనిపించాడు. పవన్ ఎంత నేచురల్ ఆర్టిస్ట్ అయినా అక్కడక్కడా అతని నటనలో కాస్త అతి కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆ పోకడలు ఎక్కడా పడకుండా త్రివిక్రమ్ జాగ్రత్త పడ్డాడు. పవన్ ఎంత అందంగా కనిపించాడో..? ఖుషి తరవాత పవన్ ని ఇంత గ్లామర్ గా చూపించింది త్రివిక్రమే. కెమెరా ఎప్పుడూ పవన్ వెంటే తిరుగుతుంది. దాన్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే పవన్ ఇమేజ్ ఈ సినిమాకి, ఈ కథకీ కావాలి. వేరే ఏ కథానాయకుడు ఈ సినిమా చేసినా.. తప్పకుండా బోల్తా పడడం ఖాయం.
ఇక త్రివిక్రమ్.. సాధారణమైన సన్నివేశాన్నికూడా తన టేకింగ్ వాల్యూస్ తో మెరుగైన అవుట్ పుట్ వచ్చేలా జాగ్రత్త పడ్డాడు. పంచ్ లు భలే పడ్డాయి. కాకపోతే ప్రాసల హడావుడి ఎక్కువైంది. ఆనందం ఎక్కడుందో వెతుకు, డబ్బులో ఉందా? పబ్బులో ఉందా? అమ్మాయిల వంటిపై నుంచి జారే సబ్బులో ఉందా..? అనే డైలాగ్ లో ప్రాస తప్ప మరేం కనిపించదు. అక్కడక్కడ చెప్పిన పిట్ట కథలు ఆకట్టుకొంటాయి. అమ్మాయిరా అభిమానం ఉంటుంది అని తండ్రి అంటే.. కొడుకు నాన్న, కోపం ఉంటుంది అని కొడుకు బదులివ్వడం త్రివిక్రమ్ పెన్ కి ఉన్న డెప్త్ ని నిదర్శనం. ఒంట్లో పట్టు తగ్గాక, మీ తాతకి పట్టుదల తగ్గిందా – ఇలాంటి డైలాగులు సీన్ కి ఒకటి చొప్పున తగులుతాయి. అలా దర్శకుడిగా, రచయితగా త్రివిక్రమ్ తన ఫుల్ ఫామ్ ని చూపించాడు. అక్కడక్కడా ప్రాసలు ఎక్కువైనా, ప్రతీవోడూ పంచ్ వేసేసినా, త్రివిక్రమ్ సినిమా కాబట్టి ఆమాత్రం ఉండాల్సిందే అని సర్దిచెప్పుకోవాలి.
ఇద్దరు హీరోయిన్లున్నారు. సమంతదే అగ్రతాంబూలం అనుకొంటాం. కానీ ప్రణీతకూ ఛాన్సొచ్చింది. ఫస్టాఫ్ లో ప్రణీతే కాసిన్ని ఎక్కువ సీన్ల లో కనిపించింది. సమంత నామమాత్రమే. ఈ లెక్క సెకండాఫ్ లో తప్పింది. ఈసారి సమంతకూ అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్. దాంతో ఇద్దరు హీరోయిన్ల ఫార్ములాకు న్యాయం చేశాడు. సెకండాఫ్ లో సమంత పుంజుకొన్నా.. హీరోయిన్లకు ఈ సినిమాలో అంత అవకాశం లేదనే చెప్పాలి. వారి కన్నా.. నదియాకే ఎక్కువ స్కోప్ ఉంది. మిర్చి తరవాత.. తనదైన శైలిలో ఆకట్టుకోగలిగింది. బొమన్ ఇరానీ నుంచి ఎక్కువ ఆశించలేం. ఆయన స్థాయికి తగిన పాత్ర కాదు. ఆ పాత్ర కోసం బొమన్ ని ఎంపిక చేయాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరైనా అంతకంటే బాగా చేయగలరు. కాకపోతే ప్రతీసారీ ప్రకాష్ రాజ్ ని చూసేవారికి మాత్రం అదో రిలీఫ్. అలీ, బ్రహ్మానందం పాత్రలు సోసోనే. రావు రమేష్ మరోసారి ఆకట్టుకొంటాడు.
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. కెమెరా పనితనం మెచ్చుకొని తీరాల్సిందే. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పుకోవాలి. పాటలు ఇప్పటికే హిట్. ఆర్.ఆర్ లోనూ తనకు తిరుగులేదని చూపించాడు. డెప్త్ ఉన్న సన్నివేశాల్లో అతని పనితనం మరింత బాగా కనిపించింది, వినిపించింది. అందుకే ఈ సినిమాకి మూడో పిల్లర్.. అతనే. కూర్పు, ఆర్ట్ విభాగం.. ఇవన్నీ తమ వంతు సహకారాన్ని అందించాయి. ఎవరెన్ని చేసినా ఫుల్ మార్కులు మాత్రం దర్శకుడికే దక్కుతాయి.
అయితే ఈ సినిమాలో లోటు పాట్లు లేవా?? అంటే లేవు .. అని చెప్పలేం. ఉన్నాయ్. కాకపోతే అవన్నీ పవన్ ఇమేజ్ ముందు, అతని పెర్ ఫార్మెన్స్ ముందూ చిన్నగానే అనిపిస్తాయి. డ్రైవర్ గా ఇంట్లో చేరిన తొలిరోజే, ఆ యజమాని కూతురు జిప్ లాగడమేమిటి?? నిజంగానే పవన్ లో డ్రైవర్ మేజరిజం ఒక్కటీ కనిపించదు. అది.. కావాలని చేశారో, లేదంటే దర్శకుడు ఆ విషయాన్ని వదిలేశాడో తెలీలేదు. కాస్ట్లీ డ్రస్స్ వేసుకొన్న డ్రైవర్ ని ఈ సినిమాలోనే చూడడం. అతను అంత అల్లరి చేసినా ఇంట్లో వాళ్లు కామ్ గా ఉంటారు. ఆ సన్నివేశాలన్నీ సినిమాటిక్ గానే అనిపిస్తాయి. కాకపోతే త్రివిక్రమ్ కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు. డ్రైవర్ గానే ఆ ఇంట్లో ఎందుకు ప్రవేశించాల్సివచ్చిందో.. కొన్ని పాత్రల ద్వారా చెప్పాడు. కాబట్టి చిన్న చిన్న లోటు పాట్లు మర్చిపోవాల్సిందే.
ఎంత ఫ్యామిలీ కథ అయినా.. మధ్య మధ్యలో పవన్ అభిమానుల అంచనాలు కూడా త్రివిక్రమ్ ని మేల్కొలిపాయి. అందుకే వారిని సంతృప్తి పరచడానికి యాక్షన్ పార్ట్ కలుపుకొంటూ వచ్చాడు. నిజానికి ఈ సినిమాని ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా క్లీన్ గానూ చూపించొచ్చు. అలా చేస్తే పవన్ ఇమేజ్ కి దూరం అవుతానేమో అని త్రివిక్రమ్ కంగారు పడ్డాడు. ఫైటింగులు ఉన్నా, మరీ చొక్కాలు చింపుకొని, కత్తులతో నరుక్కొనే బీభత్సాలకు చోటివ్వలేదు. చేత్తో సగం, డైలాగులతో సగం చితగ్గొట్టాడు.
మొత్తానికి ఓ మాస్ ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరో చేసిన క్లాస్ సినిమా ఇది. అలాగని అంతా క్లాసే కాదు.. అక్కడక్కడా మాస్ మెరుపులున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాని ఇంటిల్లిపాదీ చూసి ఆనందించేలా తీర్చిదిద్దాలి అనే దర్శక నిర్మాత తాపత్రయం మెచ్చుకోదగినదే. మరోసారి త్రివిక్రమ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తూ తీర్చిదిద్దిన ఈ చిత్రం తప్పకుండా.. సంపూర్ణమైన, స్వచ్ఛమైన వినోదాన్ని పంచుతుంది అనడంలో సందేహం ఏం లేదు. సో.. పవన్ ఫ్యాన్స్.. ఇక పండగ చేస్తోండి.
ఉపసంహరణ : విడుదలకు ముందే అత్తారింటికి దారేది సగం సినిమా బయటకు వచ్చేసింది. పైరసీ సినిమా చూసినవాళ్లంతా.. ఇక థియేటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు అనుకోకండి. ఎందుకంటే పవన్ ని వెండి తెరపై చూస్తే అదో థ్రిల్. త్రివిక్రమ్ వినోదాన్ని 70ఎమ్. ఎమ్ లో చూస్తే.. అదో ఆనందం. మీ మనసునీ, ఆనందాలనూ కుదించుకోకండి. ఇప్పుడే థియేటర్ కి వెళ్లి స్వచ్ఛమైన వినోదాన్ని ఆస్వాదించండి.