బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రియల్ లైఫ్.. రీల్ లైఫ్ లా తలపిస్తోంది. సుప్రీంకోర్టు విధించిన అయిదేళ్ల జైలు శిక్షపై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శిక్షను తప్పించుకోవడానికి ఉన్న చిట్టచివరి అవకాశం కూడా దూరం అయిపోవడంతో సంజయ్ జైలు జీవితం ఖాయమైపోయింది. ఈ నెల లోపు సంజయ్ ఎప్పుడైనా లొంగిపోయే అవకాశం ఉంది.
దాంతో మరికొద్ది రోజుల్లో జైలుకు చేరనున్న సంజయ్ దత్ రికార్డు సృష్టించారు. అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాలన్న సంజయ్ దత్ విన్నపాన్ని మన్నించిన సుప్రీం లొంగిపోయేందుకు ఆయనకు నాలుగు వారాల గడువు పొడిగించింది. రామ్ చరణ్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' లోనూ సంజయ్ దత్ నటిస్తున్న నేపథ్యంలో.. సంజయ్ పగలంతా షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు, రాత్రుళ్లు డబ్బింగ్ చెబుతున్నాడు. కొన్నాళ్ళుగా సంజయ్ దత్ దినచర్య ఇలా సాగుతోంది.
అయితే, తాజాగా 'పోలీస్ గిరి' అనే చిత్రానికి సంజయ్ దత్ కేవలం 3 గంటల్లో తన పాత్ర మొత్తానికి డబ్బింగ్ చెప్పి అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ విషయమై చిత్ర నిర్మాత రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ, సంజయ్ దత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. సంజూలాగా పాత్ర మొత్తానికి మూడు గంటల్లో డబ్బింగ్ చెప్పడం మరెవరికైనా అసాధ్యమని ప్రశంసించాడు. ఏదేమైనా సంజయ్ జీవితమే ఓ సినిమాగా తలపిస్తోంది.