ఇంతవరకు మన తెలుగు సినిమాలు ఎక్కువగా దేశంలోనే ఏదో ఒక భాషలోకి రీమేక్ అవడం చూశాము. కానీ, మొట్ట మొదటిసారిగా మన తెలుగు సినిమా ఇంగ్లీషులో రిమేక్ చేయబడి హాలివుడ్ లో విడుదల కాబోతోంది. యస్వీ.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 1997లో విడుదలయిన ‘ఆహ్వానం’ సినిమాను ఇంగ్లీషులోకి ‘డైవోర్స్ ఇన్విటేషన్’ అనే పేరుతో రిమేక్ చేస్తున్నారు. గమ్మతయిన విషయం ఏమిటంటే, అందరూ హాలివుడ్ నటులే నటిస్తున్న ఈ సినిమాను మళ్ళీ యస్వీ.కృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, దానిని డా.వెంకట్ తన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ఈ రోజు లాస్ ఏంజల్స్ లో ప్రదర్శించబడుతోంది. దానికి దర్శక నిర్మాతలతో సహా అందరూ హాజరవుతున్నారు.
ఈ సినిమాలో హాలివుడ్ నటులు జోనాధన్ బెన్నెట్, జామీ-లైన్ సైగలర్, నదియ బ్జోర్లిన్, ఎల్లియట్ గౌల్డ్, లానిక్ కాజాన్ తదితరులు ముఖ్యమయిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కధ మరియు దర్శకత్వం యస్వీ.కృష్ణా రెడ్డి చేపట్టగా, సంగీతం లెన్ని ‘స్టెప్’ బన్న్ మరియు ఎడ్ బర్గరేన అందించారు. కెమెరా:బ్రాడ్ రషింగ్ ఎడిటింగ్: గ్యారీ డీ రోచ్ మరియు బ్లూ ముర్రే.
ఈ విధంగా తెలుగు సినిమా హాలివుడ్ స్థాయికి ఎదగడం, దానిని మన తెలుగు దర్శక నిర్మాతలే నిర్మించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇంతవరకు హాలివుడ్ దర్శకులు, కధకుల చేతిలో ఒక రకమయిన మూస కధలకి అలవాటుపడిన విదేశీ ప్రేక్షకులకి మన ఆవకాయ, గోంగూర పచ్చడి వంటి కొత్త రుచులతో సరికొత్త రకం సినిమాని వడ్డిస్తున్న డా.వెంకట్ మరియు యస్వీ.కృష్ణారెడ్డిలకు అభినందనలు.