ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన సంఘటనలో తన తప్పిదమేమి లేదని కొంతమంది కుట్రపన్ని ఈ అంశాన్ని భూతద్దంలో చూపిస్తున్నారని కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు, ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ తేజ ఆరోపించారు. ఈ నెల 5వ తేదిన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ హోటల్ వద్ద జరిగిన సంఘటనలో రామ్ చరణ్ బాడీగార్డ్ లు ఇరువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను రోడ్డుపైనే దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను తన భార్య ఉపానసనతో కలసి కారులో వెళుతున్నానని వెనకగా వేరే కారులో వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ పట్ల అనుచితంగా ప్రవర్థించి తమను టీజ్ చేశారని ఎంతచెప్పినా వినలేదని తట్టుకోలేని పరిస్థితుల్లోనే తన బాడీ గార్డ్ లు వారిని అడ్డుకున్నారని చరణ్ వివరించారు. ఆ సమయంలో సీసీ కెమెరాలో రికార్డయిన ఫోటోలను మార్ఫింగ్ చేసి మీడియాకు ఇచ్చారని, కేవలం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొని మాత్రమే తాను వారిపై పోలీసు కేసు పెట్టలేదని చరణ్ తెలిపారు. దీనిని ఇంతకుమించి రాద్ధాంతం చేయవద్దని ఆయన మీడియాను కోరారు.