దర్శకుడు శంకర్ సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిన చిత్రాల్లో జీన్స్ ఒకటి. కవల పిల్లల కథకు లవ్ కోటింగ్ ఇచ్చి... ఆ సినిమాని రక్తికట్టించాడు. రెహమాన్ స్వరపరిచిన పాటలు.. ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఐశ్వర్యరాయ్ కెరీర్‌లో చెప్పుకోదగిన చిత్రాల్లో జీన్స్ ఒకటిగా నిలిచింది. జీన్స్ తరవాత ప్రశాంత్‌కు మరో హిట్ కూడా దక్కలేదు. అందుకే ఇన్నేళ్ల తరవాత ప్రశాంత్ మళ్లీ జీన్స్ కథనీ, టైటిల్‌నే నమ్ముకొన్నాడు. జీన్స్ సినిమాకి ప్రశాంత్ సీక్వెల్ చేయబోతున్నాడు. ప్రశాంత్ తండ్రి పాండిరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తన సొంత సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. జీన్స్ 2 అనే టైటిల్ ని ఈమధ్యే ఆయన చెన్నై ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. ఇది కూడా కవలల కథేనట. 2014 ప్రారంభంలో ఈ సినిమాసెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారమ్. డీలా పడిన ప్రశాంత్ కెరీర్‌ని జీన్స్ 2 అయినా గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.