మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ నేతల బుజ్జగింపులకు తలొగ్గలేదంట. కొన్ని రోజుల నుంచి కొండా దంపతులు వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారంటూ వార్తలు వస్తున్నవి. వీటిపై ఇప్పటివరకూ కొండా దంపతులు స్పందించలేదు. మౌనం అర్థాంగీకారం అని అన్నట్లుగానే వారి వ్యవహార శైలి నడిచింది.
పార్టీ పట్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయేమోనని ఆలోచించిన వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ కొండా దంపతులను బుజ్జగించడానికి ఓ టీమ్‌ని పంపగా, 'ఇన్నాళ్ళూ మేం గుర్తుకు రాలేదా?' అని వారు దూతలను నిలదీశార్ట. చిన్న చిన్న సమస్యలుంటే వాటిని అధినేతతో మాట్లాడి పరిష్కరించుకుంటే మంచిదని దూతలు కొండా దంపతులకు సూచించినట్లుగా తెలుస్తున్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ మాత్రం ఇది పెద్ద వివాదం కాదని, వారు పార్టీకి దూరంగా లేరని చెప్పుకుంటూ వస్తున్నది.